ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే.. పట్టణాల్లో మార్పు సాధ్యపడుతుందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో అనేక వెసులుబాట్లు కల్పించడంద్వారా ప్రభుత్వం ప్రజలపై ఎంతో విశ్వాసముంచిందని.. ఆ విశ్వాసాన్ని వమ్ముచెయ్యవద్దని కోరారు. ‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి పద్ధతులు మార్చుకొందాం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత బాధ్యతగా పనిచేసినా.. ప్రతి పట్టణవాసి, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కూడా బాధ్యత పెరిగినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. పురపాలన అంటేనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పరిపాలన అని చెప్పారు. సీసా నీళ్లు తాగడం మానేసి.. మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛమైన మంచినీటిని తాగడం అలవాటుచేసుకోవాలని హితవుచెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం మంగళవారం రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కొనసాగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా పట్టణాలు, నగరాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.