పెట్టుబడులతో రండి

అమెరికాలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార, పారిశ్రామికవేత్తలను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ కోరారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల కోసం చూస్తున్నామన్న ఆయన వ్యాపారానికి అనువైన పరిస్థితులను నెలకొల్పుతామని, అడ్డంకులను తొలగించి.. నిబంధనలను మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌.. మంగళవారం ఇక్కడ దేశీయ పరిశ్రమ దిగ్గజాలతో సమావేశమైయ్యారు. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, మహీం ద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీం ద్రా, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు.